: చంద్రబాబు ఫోనునూ ట్యాప్ చేసిన టీ పోలీస్?... ఏపీ సర్కారుకు పోలీస్ రిపోర్ట్!
ఓటుకు నోటు కేసు పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కోసం పాకులాడిన టీడీపీని ఇరుకునపెట్టేందుకు రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంలోని పెద్దల ఫోన్లపై నిఘా వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందని, ఈ క్రమంలో ఆ రాష్ట్ర పోలీసులు మరింత ముందుకెళ్లి ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ పోలీసులు ట్యాప్ చేసిన ఫోన్లపై దర్యాప్తు ప్రారంభించిన ఏపీ పోలీసులు నిన్న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించారట. ఈ నివేదికలో పలు సంచలన విషయాలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫోన్ తో పాటు ఆయన చుట్టూ ఉండే ముఖ్య అధికారులు, కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్లు కూడా టీ పోలీస్ ట్యాప్ చేసిన ఫోన్ల జాబితాలో ఉన్నాయని సమాచారం. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏపీ పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టనున్నారు.