: మోదీ అడుగు జాడల్లోనే... ప్రొటోకాల్ పాటించని బంగ్లా ప్రధాని
మోదీ అడుగు జాడల్లోనే నడిచారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఈ సంవత్సరం జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్ నిబంధనలను పక్కనబెట్టి మరీ మోదీ ఆయనకు స్వాగతం పలికేందుకు పాలమ్ విమానాశ్రయానికి వెళ్లారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు భారత ప్రధానిని ఆహ్వానించేందుకు హసీనా ప్రొటోకాల్ ను పక్కన పెట్టారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. బంగ్లాదేశ్ సందర్శనకు మోదీ రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. సంప్రదాయ స్వాగతం సందర్భంగా బంగ్లా జాతీయ గీతం 'సోనార్ బంగ్లా'తో పాటు 'జనగణమన' గీతాన్నీ ఆలపించారు. కాగా, ఇరు దేశాల మధ్యా 40 సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు కొన్ని గ్రామాలను బంగ్లాదేశ్ కు ఇచ్చి, మరికొన్ని గ్రామాలను ఇండియాలో కలుపుకునే చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు నేతలూ సంతకాలు పెట్టనున్నారు.