: ఆటగాళ్ల జవాబులు సరిగా లేవట!... భారత 'విలు'వీరులకు అమెరికా ఎంబసీ షాక్


అమెరికాలోని సౌత్ డకోటాలో యాంక్టన్ వేదికగా జరిగే యూత్ ఆర్చరీ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు భారత ఆర్చర్ల బృందం కూడా సిద్ధమైంది. అయితే, ఢిల్లీలోని అమెరికా ఎంబసీ భారత విలువీరులకు షాకిచ్చింది. జట్టులోని 20 మందికి వీసా నిరాకరించింది. వారిలో విదేశీ కోచ్ చూ వోమ్ లిమ్ కూడా ఉన్నారు. వాస్తవానికి భారత జట్టు శనివారం అమెరికా బయల్దేరాల్సి ఉంది. పోటీలు జూన్ 8 నుంచి 14 వరకు జరుగుతాయి. కొందరికి వీసాలు ఇచ్చి, మరికొందరికి వీసాలు నిరాకరించడం పట్ల భారత్ ఆర్చరీ సంఘం దిగ్భ్రాంతికి గురైంది. అమెరికా ఎంబసీ చర్యతో టోర్నీలో భారత్ జట్టు ప్రాతినిధ్యం అనుమానంగా మారింది. ఇంటర్వ్యూ సమయంలో ఆటగాళ్ళు ఇచ్చిన సమాధానాలు సరిగా లేవని, అందుకే వీసాలు ఇవ్వలేమని అమెరికా ఎంబసీ పేర్కొన్నట్టు ఆర్చరీ సంఘం కోశాధికారి వీరేందర్ సచ్ దేవా తెలిపారు. మన ఆర్చర్లు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో వారి భాషా నైపుణ్యం అంతంతమాత్రమేనని, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేకపోవడం వీసాల జారీకి ప్రతికూలంగా మారిందన్నారు. అయితే, ఎన్నో అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సౌత్ కొరియాకు చెందిన కోచ్ లిమ్ కు కూడా వీసా నిరాకరించడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని సచ్ దేవా చెప్పారు.

  • Loading...

More Telugu News