: పలు సేవలను నిలిపివేసిన యాహూ
భవిష్యత్తులో సెర్చ్, డిజిటల్ సేవలపై మరింతగా విస్తరించాలని భావిస్తున్న యాహూ కొన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మ్యాప్స్, యాపిల్ పాత తరం ఐ ఫోన్ల కోసం తయారు చేసిన మెయిల్ యాప్, ఫిలిప్పీన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన హోం పేజి, ఫ్రాన్స్, కెనడాల్లో మ్యూజిక్ సేవలు, స్పెయిన్ లో మూవీస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల్లో యాహూ టీవీ, యాహూ ఆటోస్ తదితర సేవలను ఈ నెలాఖరు నుంచి విరమించుకోనున్నట్టు సంస్థ చీఫ్ ఆర్కిటెక్ట్ అమోజ్ మైమాన్ వెల్లడించారు. కాగా, గూగుల్ మ్యాప్స్ గణనీయమైన ప్రాచుర్యం పొందడంతో యాహూ మ్యాప్స్ వినియోగిస్తున్నవారు తగ్గిపోయారని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, యాహూ ఫోటో షేరింగ్, వెబ్ సైట్ ఫ్లిక్కర్ తదితరాలకు యాహూ మ్యాప్స్ మద్దతు కొనసాగుతుందని మైమాన్ తెలిపారు.