: బొత్స సత్తిబాబు కాంగ్రెస్ పార్టీకి మూడు రోజుల క్రితమే రాజీనామా చేశారట!
కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి, వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న బొత్స సత్యనారాయణ వ్యవహారం ఆసక్తికరంగా సాగుతోంది. వైసీపీలో చేరుతున్నట్టు సత్తిబాబు దాదాపు వారం క్రితమే ప్రకటించారు. ఆ మేరకు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలందరూ తామంతా సత్తిబాబు వెంటేనని తేల్చిచెప్పారు. బొత్స వైసీపీలో చేరితే, విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్టే. దీనిపై కాస్త ఆలస్యంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్ఠానం నేటి ఉదయం సత్తిబాబుపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీకి రాజీనామా చేసిన తనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయడమేమిటని సత్తిబాబు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారట. ఇదే విషయాన్ని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి కూడా తెలియజేశారట.