: ఎప్పుడూ అలాగే కూర్చోవాలని కోరుకుంటున్నావా, ఏంటి?: జోకేసిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి వేదికపై ఓ జోకేశారు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏర్పాటు చేసిన 'నీరు-చెట్టు' కార్యక్రమంలో డ్వాక్రా, అంగన్ వాడీ సంఘాల ప్రతినిధులను వేదికపై కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలు, మంత్రులను వేదిక కింద తొలి వరుసలో కూర్చోబెట్టారు. ఓ మహిళా సంఘం ప్రతినిధి సభలో ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ విషయాన్ని గుర్తు చేశారు. "ప్రియతమ ముఖ్యమంత్రి మా సంఘాల వారిని వేదికపై కూర్చోబెట్టి గౌరవం పెంచారు, ఎమ్మెల్యేలను సైతం కింద కూర్చోబెట్టారు" అని అనగానే, చంద్రబాబు మైకు అందుకొని, "ఏమ్మా ఎప్పుడూ అలాగే కూర్చోవాలని కోరుకుంటున్నావా, ఏంటి?" అన్నారు. బాబు మాటలతో సభలో నవ్వులు విరిశాయి.