: తనలా ఉండొద్దంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులకు, విద్యార్థినీ విద్యార్థులకూ, టెక్కీలకూ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆదర్శవంతుడనటంలో సందేహం లేదు. ఆయన మాత్రమే కాదు, స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్ బర్గ్, ఓప్రా విన్ ఫ్రే వంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని జీవితంలో పైకెదిగిన వాళ్లెందరో ఉన్నారు. వీరికి కాలేజీ డిగ్రీల అవసరం లేకపోయింది. అయితే, ప్రస్తుత తరం యువతీ యువకులకు కాలేజీ డిగ్రీ మరిన్ని అవకాశాలను దగ్గర చేస్తుందని, ఈ విషయంలో తమలాగా ఉండవద్దని, కాలేజీ చదువును మధ్యలో ఆపేయవద్దని బిల్ గేట్స్ సూచించారు. "నేను కాలేజీ విద్యను మధ్యలోనే ముగించినా, అదృష్టవశాత్తూ సాఫ్ట్ వేర్ రంగంలో ఎదిగే అవకాశం లభించింది. అయితే, ఓ డిగ్రీని సంపాదించడంతో విజయ తీరాన్ని మరింత సులువుగా చేరగలుగుతారు" అని అన్నారు. డిగ్రీలు లేనివారి కంటే, ఉన్నవారు మరింత ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని ఆయన వివరించారు. కాలేజీకి వెళుతున్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఉత్తీర్ణులై బయటకు వస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉండడం సమస్య తీవ్రతను పెంచుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.