: తెలంగాణలో దేవుళ్లకు అర్చనలు లేవు, పూజలు లేవు... మానసిక వేదనలో భక్తులు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యాప్తంగా అర్చకులు సమ్మె బాట పట్టారు. దీంతో ఏ దేవుడికీ తెల్లవారుఝామున అభిషేకం మినహా మరో సేవ అందలేదు. అన్ని గుళ్లలో ఆర్జిత సేవలు రద్దు చేసి పూజారులు నిరసన తెలుపుతున్నారు. అర్చనలు, పూజలు, అభిషేకాలు, వాహన పూజలు వంటి సేవలను నిలిపివేయడంతో భక్తులు తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ గుడి, నల్లకుంట రామాలయం, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం... ఇలా వందలాది దేవాలయాల్లో ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసిన అర్చకులు తమ సమస్యలు తీర్చాలని పట్టుబట్టారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడేవరకూ సమ్మె కొనసాగుతుందని అర్చక సంఘాల నేతలు వెల్లడించారు.