: స్మృతి ఇరానీని ఇబ్బంది పెట్టిన ప్రశ్న!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఓ చానల్ చర్చా కార్యక్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆజ్ తక్ చానల్ 'స్మృతీ కీ పరీక్షా' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని చానల్ పొలిటికల్ ఎడిటర్ అశోక్ సింఘాల్ ఓ ప్రశ్న అడిగారు. వయసులో చిన్నవారైనా, మానవ వనరుల శాఖ దక్కించుకున్నారని, ఆయన (మోదీ) మీలో ఏం చూసి పదవి ఇచ్చారని అడిగారు. దీంతో, స్మృతి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తేరుకుని, మహిళలు ఈ ప్రశ్నను మరోసారి వినాలని రిపీట్ చేయించారు. దీనిపై, సింఘాల్ స్పందిస్తూ, మంత్రి విద్యార్హతలకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే తానీ ప్రశ్న అడిగానని వివరణ ఇచ్చారు. ఆమె విద్యార్హతలు ప్రశ్నార్థకమైన నేపథ్యంలో, మంత్రి పదవి ఎలా లభించిందన్నదే తన ప్రశ్న వెనుకున్న ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఒక మహిళా మంత్రిని పట్టుకుని అలాంటి ద్వంద్వార్థపు ప్రశ్న వేసిన అశోక్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.