: కాశ్మీర్ అంశంపై పాక్ ఆర్మీ చీఫ్ ప్రవచనాలు!
పాకిస్థాన్ నేతలతో పాటు సైన్యం కూడా కాశ్మీర్ అంశంపై తరచుగా వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. విభజనకు సంబంధించి కాశ్మీర్ ఓ అసంపూర్ణ అజెండా అని పేర్కొన్నారు. అంతేగాకుండా, కాశ్మీర్ ను, పాక్ ను వేరుచేయలేరని తెలిపారు. ఇస్లామాబాదులోని నేషనల్ డిఫెన్స్ యూనివర్శిటీ (ఎన్డీయూ) లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తాము ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కాశ్మీర్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) పాక్ లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అల్లర్లను సైన్యం అనుమతించబోదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తుండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన మరుసటిరోజే పాక్ ఆర్మీ చీఫ్ స్పందించడం గమనార్హం.