: టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న ఎస్సై... విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఉద్రిక్తత
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర దీక్షకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం టీడీపీ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గోపాలపట్నంలోనూ ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఓ కార్యకర్తపై పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేయి చేసుకున్నారు. దీంతో భగ్గుమన్న టీడీపీ శ్రేణులు పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది.