: రూ. 200 కోట్లు నొక్కేసి అనుమతులిచ్చిన రాజా: కోర్టుకు వెల్లడించిన ఈడీ
మాజీ టెలికం మంత్రి ఎ.రాజ రూ. 200 కోట్లను ప్రతిఫలంగా తీసుకుని చట్ట విరుద్ధంగా రెండవ తరం రేడియో తరంగాల అనుమతులను జారీ చేశారని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. ఈ డబ్బు అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి కుటుంబానికి చెందిన కలైంగర్ టీవీకి పెట్టుబడుల రూపంలో వెళ్లిందని తుది వాదనల సమయంలో ఈడీ స్పష్టం చేసింది. పలు కంపెనీల ద్వారా ఈ డబ్బు కలైంగర్ టీవీలోకి వెళ్లిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ తన వాదన వినిపించారు. డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, పార్లమెంటు సభ్యురాలు కనిమోళి, ఆయన భార్య దయాళు అమ్మాళ్ ల పేరు మీద టెలివిజన్ చానల్ నడుస్తోందని, రాజా కూడా ఆ పార్టీకి చెందిన వాడేనని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ముందు గ్రోవర్ వాదించారు. కోర్టు ముగిసేలోగా ఆయన తన వాదనను పూర్తి చేయలేకపోవడంతో తదుపరి కేసు విచారణను జూలై 27కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.