: సూటూ బూటూ వద్దు, క్యాజువల్స్ చాలు... మారిన ఇన్ఫోసిస్ వైఖరి


మెడకు గట్టిగా చుట్టుకుని పని చేసేందుకు ఇబ్బంది పెట్టే 'టై'లు, ఒంటిపై చమటలు పట్టిస్తూ, చిరాకును తెప్పించే కోటు... ఇన్ఫోసిస్ లో ఇకపై మాయం కానున్నాయి. అందరు ఇన్ఫోసియన్లూ తమకిష్టమైన, అనుకూలంగా ఉండేలా క్యాజువల్ దుస్తులు ధరించి రావచ్చని సంస్థ స్పష్టం చేసింది. అయితే, చూసేందుకు మరీ ఇబ్బందికరంగా ఉండకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. దీంతో కంపెనీలో సంవత్సరాలుగా అమలవుతున్న దుస్తుల నిబంధనలకు తెరపడినట్లయింది. ఇన్ఫోసిస్ లో సోమవారం నుంచి గురువారం వరకూ తప్పనిసరిగా ఫార్మల్స్ ధరించాలన్న నిబంధన అమలవుతుండేది. సంస్థలో అత్యధిక ఉద్యోగులు 20 నుంచి 30 ఏళ్ల వయసువారు కావడంతో ఎప్పుడూ ఫార్మల్స్ నిబంధనపై చర్చ జరుగుతూనే ఉండేది. సంస్థ బాధ్యతలను విశాల్ శిక్కా చేపట్టిన తరువాత ఈ నిబంధన తొలగిపోతుందని పలువురు భావించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇన్ఫీలో దుస్తుల నిబంధనను ఆయన తొలగించారు. స్వతహాగా, బ్లాక్ టీషర్టు లేదా జాకెట్ ధరించి కార్యాలయానికి వచ్చే ఆయన, ఉద్యోగుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఇన్ఫీ మానవ వనరుల విభాగం వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వివరించారు. అన్ని విభాగాల నుంచి ఎంపిక చేసిన ఉద్యోగులతో ఏర్పడ్డ ఓ టీమ్ డ్రెస్ కోడ్ అమలుపై చేసిన విజ్ఞప్తుల మేరకు విశాల్ స్పందించారని తెలిపారు. కాగా, మారిన డ్రెస్ కోడ్ పై ఉద్యోగులందరికీ ఇ-మెయిల్స్ అందాయి. జూన్ 1 నుంచి వారమంతా మీకు నచ్చిన జీన్స్, టీషర్టులు ధరించవచ్చని, మీ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని మెయిల్స్ అందాయి. దుస్తుల విషయంలో సరైన నిర్ణయాధికారం మీకుందని భావిస్తున్నామని, ఈ విషయంలో సంస్థ గౌరవాన్ని మరింతగా పెంచాలని ఉద్యోగులకు రాసిన మెయిల్ లో విశాల్ కోరారు.

  • Loading...

More Telugu News