: వైజాగ్ పోలీసులకు వింత దొంగ సవాల్... ఇంట్లో ఏమీ దొరకలేదని గోడపై సందేశం
ఇదో కొత్తరకం దొంగ గారికథ. విశాఖపట్నంలో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి అక్కడేమీ భారీగా దొరక్కపోయేసరికి సదరు దొంగ తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీంతో, 'ఈ ఇంట్లో ఏమీ దొరకలేదు' అంటూ పోలీసులను ఉద్దేశించి ఓ సందేశం రాసి సంచలనం సృష్టించాడు. వివరాల్లోకెళితే... నగరంలోని పిఠాపురం కాలనీలో ఓ అపార్ట్ మెంట్ ను సదరు దొంగ లక్ష్యంగా ఎంచుకున్నాడు. తొలుత సీతారాం అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్లో ప్రవేశించాడు. అక్కడ 10 తులాల బంగారం, రూ.40 వేల నగదు అపహరించాడు. వారింట్లో ఫ్రిజ్ లో ఉన్న జ్యూస్ తాగి, టేబుల్ పై ఆహార పదార్థాలు భుజించి నిష్క్రమించాడు. అనంతరం, ప్రొఫెసర్ రామచంద్ర నాయక్ ఇంట్లో చొరబడి ఇల్లంతా చిందరవందర చేశాడు. అయితే, అక్కడ పెద్ద మొత్తంలో ఏమీ లభ్యం కాలేదు. 5 తులాల బంగారం, రూ.20 వేల నగదుతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. దీంతో, దొంగ ఆ ఇంటి గోడపై పోలీసులను ఉద్దేశించి ఓ సందేశం రాశాడు. "ఈ ఇంట్లో ఏమీ దొరకలేదు ఏసీపీ సార్, సీఐ సార్, ఎస్సై సార్. ఐదు తులాల బంగారం, ఇరవై వేలు డబ్బు దొంగతనం చేశా!" అంటూ సవాల్ విసిరాడు. అంతేగాదు, చోరీ సొత్తుతో పాటు ప్రొఫెసర్ గారి వ్యాగన్ ఆర్ కారును కూడా ఎత్తుకెళ్లాడు. ప్రొఫెసర్ తన కారు తాళాలు ఇంట్లోనే వదిలివెళ్లడం దొంగకు లాభించింది. ఇక, తమ ఇంట్లో గోడపై సందేశం చూసిన ఆ ప్రొఫెసర్ కుటుంబం ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.