: ఎంబీయే చదివింది... దొంగల ముఠాకు లీడర్ అయింది!


ఇటీవల కాలంలో ఉన్నత విద్యావంతులు కూడా చోరీల బాట పడుతున్నారు. అయితే, బాగా చదువుకున్న మహిళలు కూడా నేరాలకు పాల్పడుతుండడం విస్మయం కలిగిస్తోంది. శ్వేతా గుప్తా అనే యువతిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె ఎంబీఏ చదివింది. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ఏజెన్సీలో పనిచేసింది. అయితే, వాహనాలను తస్కరించడం పనిగా పెట్టుకుంది. అందుకోసం ఐదుగురు సభ్యుల ముఠాను ఏర్పాటు చేసుకుందీ కిలాడీ. ఈ అంతర్ రాష్ట్ర ముఠాకు ఈమే లీడర్. శ్వేతను ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్నింటిని శ్వేత నివాసం ఉంటున్న కాన్పూర్ లో స్వాధీనం చేసుకున్నారు. అంతేగాదు, దొంగిలించిన వందలాది వాహనాల తాలూకు భాగాలు కాన్పూర్, లక్నో, ఆగ్రాలోని పాత సామాన్ల డీలర్ల వద్ద లభ్యమయ్యాయి. 2007లో అలహాబాద్ లోని ఓ వాహనాల ఏజెన్సీలో క్లర్క్ గా ఉద్యోగ ప్రస్థానం ఆరంభించిన శ్వేత విలాసవంతమైన జీవితంపై మోజుతో పెడదారి పట్టింది. దొంగిలించిన వాహనాలు అమ్మేందుకు అమ్మడు ఏకంగా మూడు కార్యాలయాలు నిర్వహిస్తుండడం గమనార్హం. పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ గా మారిన ఈ దొంగలరాణి ఎన్నోసార్లు తప్పించుకుంది. చివరికి శనివారం నాడు ఉత్తరప్రదేశ్ లో అరెస్టయింది.

  • Loading...

More Telugu News