: ఇన్వెస్టర్లకు రుచించని ఆర్బీఐ నిర్ణయం... నష్టాల్లో స్టాక్ మార్కెట్స్
రెపో రేటును తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రుచించలేదు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రెపో రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించగానే మార్కెట్ పడిపోయింది. 11:01 గంటల సమయంలో 27,712 పాయింట్ల వద్ద ఉన్న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్, 11:03 గంటల సమయానికి 27,507 పాయింట్లకు దిగజారింది. అంటే, రెండు నిమిషాల వ్యవధిలో 200 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. ఆపై స్వల్పంగా రికవరీ అయినట్టు కనిపించినప్పటికీ, మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో 11:40 గంటల సమయానికి సెన్సెక్స్ 27,430 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే, ఇది 440 పాయింట్ల పతనం.