: ఆగని 'ఉబెర్' డ్రైవర్ల ఆగడాలు... బలవంతంగా ముద్దు పెట్టాడని యువతి ఫిర్యాదు


మొబైల్ యాప్ ఆధారిత క్యాబ్ సేవల సంస్థ 'ఉబెర్' డ్రైవర్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. గుర్గావ్ కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని క్యాబ్ ఎక్కితే, ఆ డ్రైవర్ బలవంతంగా ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి 10 గంటల సమయంలో వినోద్ అనే డ్రైవర్ గుర్గావ్ సన్ సిటీ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర దించాడని, ఆపై తన బ్యాగులు చేతికందిస్తూ, "నైస్ టూ మీట్ యూ మామ్" అంటూ చెయ్యందించాడని, తాను ఓ మంచి వ్యక్తని భావించి కరచాలనం కోసం చెయ్యి చాచగా, బలంగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడని ఆ యువతి ఆరోపించింది. ఇదే విషయాన్ని ఉబెర్ కు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఫిర్యాదు అందిన వెంటనే డ్రైవర్ పై చర్యలు తీసుకున్నామని, ఈ తరహా ఘటనలను తాము సహించబోమని ఉబెర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు ఉంచింది. ఈ కేసులో ఇంకా వినోద్ ను అదుపులోకి తీసుకోలేదని సమాచారం. ఆరు నెలల క్రితం ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పై ఉబర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News