: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడింది నిజమే: అంగీకరించిన ఎర్రబెల్లి
తమ పార్టీ ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మాట వాస్తవమేనని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అంగీకరించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి భేటీ జరిగిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఉదంతం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది కదా? అని విలేకరులు ప్రశ్నించగా, అదంతా కేసు విచారణలో తేలుతుందని, టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యాలని తాను కూడా 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడానని, వారిలో చాలా మంది అందుకు అంగీకరించారని ఎర్రబెల్లి అన్నారు. ఈ ఎన్నికల కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని, ముగ్గురు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఆ పార్టీ, ఐదుగురిని పోటీలో నిలబెట్టి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సర్కారు అవినీతిని ఎండగడుతున్నందునే రేవంత్ ను ఏసీబీ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు.