: రేవంత్ రెడ్డికి అసెంబ్లీ నుంచి ‘వెలి’ తప్పదా?... టీఆర్ఎస్ లో జోరుగా చర్చ!


ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోందట. తద్వారా ఈ అసెంబ్లీ గడువు ముగిసేదాకా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి దూరంగా పెట్టేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు మరో నాలుగేళ్ల పాటు ఉంది. అప్పటిదాకా రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వెలివేసేందుకు ఉన్న అవకాశాల వైపు ప్రభుత్వం దృష్టి సారించిందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డిపై నాలుగేళ్ల పాటు బహిష్కరణ వేటు వేయడం, లేదా ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ఆయనను అసెంబ్లీకి దూరంగా పెట్టడం ఖాయమని ఆ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే రేవంత్ పై చర్యలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే దిశగా సర్కారు పావులు కదుపుతోందట. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి బహిష్కరణ వేటుకు గురైతే, నాలుగేళ్ల పాటు అసెంబ్లీకి దూరంగా ఉండక తప్పదు. అలా కాకుండా ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తే, కొడంగల్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మళ్లీ పోటీకి దిగి గెలిచి సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. దీంతో రేవంత్ రెడ్డిని సభకు దూరంగా ఉంచేందుకు ఏ చర్య తీసుకుంటే బెటరన్న అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, దానిని తిప్పికొట్టే వ్యూహాలకు టీడీపీ కూడా పదును పెడుతోంది.

  • Loading...

More Telugu News