: రేవంత్ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది?
టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. నిన్న రేవంత్ రెడ్డికి చెందిన రూ. 50 లక్షలతో పాటు రెండు ఐఫోన్ లను సీజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు క్లియర్ గా పేర్కొన్నారు. వీటితో పాటు సోనీ కంపెనీకి చెందిన మూడు ఐసీ రికార్డర్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీంతోపాటు, రేవంత్ ఉపయోగించిన ఒక నోకియా ఫోన్, సెబాస్టియన్ ఉపయోగించిన ఒక హెచ్ టీసీ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీటితో పాటు, కేసులో మూడో నిందితుడు ఉదయసింహ ఉపయోగించిన నోకియా ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటి నుంచి వీడియో రికార్డింగ్స్ ను, కాల్ డేటాను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత స్టీఫెన్ కు రూ.2 కోట్లు ఆఫర్ చేశారని... ఆ తర్వాత సెబాస్టియన్ రూ. 5 కోట్లు ఆఫర్ చేశారని... దీంతో, తాము నిఘా మరింతగా పెంచామని వెల్లడించారు. రేవంత్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని... అందువల్ల విచారణ నిమిత్తం ఆయనను తమకు అప్పగించాలని రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ అధికారులు విన్నవించారు.