: డబ్బా కొట్టుకుంటున్న బాబు... సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్: షబ్బీర్ అలీ
ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని వ్యాఖ్యానించిన తెలంగాణ విధాన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, బాబుకు వెన్నుపోటుదారుడనే గుర్తింపు తప్ప జాతీయ నేతగా గుర్తింపు లేదని అన్నారు. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రాష్ట్రంలో బలంగా ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవని, 2019లోగా టీ-టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తానని సీఎం కేసీఆర్ అనడాన్ని స్వాగతిస్తున్నామని, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆయనకు నమ్మకం పోయినట్టుందని షబ్బీర్ అన్నారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ఆయన, తక్షణం ఉపఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.