: మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ కన్నా బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలే అధికం: తాజా అధ్యయనం
భారతదేశంలో మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత కొంత కాలం వరకూ సెర్వికల్ (గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ అత్యధిక మహిళలను బలిగొంటే, ఇప్పుడా స్థానాన్ని రొమ్ము క్యాన్సర్ ఆక్రమించింది. 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ క్యాన్సర్ 2013' నివేదిక ప్రకారం 1990లో మొత్తం మరణాల్లో 12 శాతంగా ఉన్న క్యాన్సర్ మరణాలు 2013లో 15 శాతానికి పెరిగాయి. ఇక ఇండియా విషయానికి వస్తే క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 60 శాతం పెరిగింది. గుండెపోటు తరువాత మహిళల్లో అత్యధిక మరణాలకు కారణంగా రొమ్ము క్యాన్సర్ నిలుస్తోంది. గడచిన 23 సంవత్సరాల వ్యవధిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య 88 శాతం పెరగగా, జీర్ణకోశ క్యాన్సర్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 64 శాతం పెరిగింది. ప్రొస్టేట్ క్యాన్సర్ మరణాలు 220 శాతం పెరిగాయి. 2013లో రొమ్ము క్యాన్సర్ కారణంగా 47,587 మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడి 40,985 మంది మృతి చెందారని ఈ నివేదిక వెల్లడించింది.