: ఏపీలో చేరినప్పటికీ టీ-ఉద్యోగులకు నిరాశే!
తెలంగాణ ఉద్యోగులుగా ఉండి ఏపీకి ఆప్షన్ పెట్టుకున్న ఉద్యోగులను ఒకవేళ అక్కడికి తీసుకెళ్లినా, పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగానే ఉంచాలన్న డిమాండుకు ఆమోదం లభించేట్టుంది. తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్లుగా ఉండగా, ఏపీలో మాత్రం అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకి పెంచుతూ బాబు సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీకి వెళ్తే మరో రెండేళ్లు ఉద్యోగాలు చేసుకోవచ్చని భావిస్తున్న కొందరు తెలంగాణ ఉద్యోగులు అక్కడి ఆప్షన్స్ ఎంచుకున్నారు. దీనిపై తమకు నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఏపీకి ఆప్షన్ తీసుకున్నప్పటికీ, వారికి ఆ ప్రయోజనం దక్కకుండా చేయాలని ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఉద్యోగులకు అనుకూలంగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా ఏపీ ఆప్షన్ గా పెట్టుకున్న తెలంగాణ అధికారులు సుమారు 700 మంది వరకు ఉంటారని అంచనా.