: ఎబోలాను మించిన భయంకర వైరస్ కోట్లాది ప్రాణాలను బలి తీసుకోనుంది: బిల్ గేట్స్
ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన ఎబోలాను మించిన వైరస్ ప్రపంచాన్ని కాటేయనుందని, ఆ వైరస్ ఏడాది వ్యవధిలోనే 3.3 కోట్ల మంది ప్రాణాలు తీస్తుందని హెచ్చరిస్తున్నారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఈ వైరస్ ఎప్పుడు దాడి చేస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేమని, అయితే, యుద్ధానికి వెళ్లే ముందు సిద్ధమయ్యేలా, ఈ వైరస్ పై పోరాడేందుకు నిత్యమూ సన్నద్ధంగా ఉండాలని ఆయన కోరారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఇటీవల జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ భయంగొలిపే విషయాలు తెలిపారు. ఈ వైరస్ పై పోరుకు ‘టెక్నాలజీ’ అనే ఆయుధం చేతబట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 20వ శతాబ్దం ఆరంభంలో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్ ఫ్లూ వైరస్ ను ప్రస్తావించారు. తాజాగా భయపెడుతున్న వైరస్ ఏ రూపంలో దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బిల్ గేట్స్ అన్నారు.