: ఆస్ట్రేలియా యువతులకు ఐఎస్ఐఎస్ వల
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆస్ట్రేలియా యువతులకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విక్టోరియా తీవ్రవాద నిరోధక దళం తెలియజేసింది. 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఆసీస్ అమ్మాయిలకు విలాసవంతమైన సౌకర్యాలతో జీవనం కల్పిస్తామని ఆశ చూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 12 మంది ఆసీస్ యువతులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు ప్రయత్నించారని, ఐదుగురు సిరియా వెళ్లారని, మరో నలుగురిని టర్కీలో అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. వీరంతా మెల్ బోర్న్ పరిసర ప్రాంతాలకు చెందిన వారని, వీరిని వివాహం చేసుకోవడమే ఉగ్రవాదుల లక్ష్యమని తెలిపింది. యువకులతో పోలిస్తే, యువతులను సులువుగా లొంగదీసుకోవచ్చన్నది ఐఎస్ ఉద్దేశమని వివరించింది. వీరి మాయలో పడుతున్న అమ్మాయిలు సిరియా, ఇరాక్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని తెలియజేసింది.