: 700 మ్యాచ్ లు గెలిచిన భారత టెన్నిస్ దిగ్గజానికి 100వ జతగాడిగా ప్రపంచ దిగ్గజం!


పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా భారత్ తరపున డబుల్స్ లో డేనియల్ నెస్టర్ తో కలసి ఆడుతున్న లియాండర్ పేస్ 700 మ్యాచ్ లు గెలిచిన అరుదైన రికార్డును అందుకున్నాడు. డబుల్స్ పోటీల్లో భాగంగా లియాండర్ పేస్ ఇప్పటివరకూ 99 సార్లు తన భాగస్వాములను మార్చుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ అనంతరం మరోసారి పేస్ తన జతగాడిని మార్చుకోవచ్చని తెలుస్తోంది. అయితే, పేస్ తో ఈ దఫా స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ జతకట్టవచ్చని తెలుస్తోంది. పేస్ ఇప్పటివరకూ 55 డబుల్స్ టైటిళ్లు గెలుచుకోగా, అందులో 8 గ్రాండ్ స్లామ్ టైటిళ్లున్నాయి. తన 40 సంవత్సరాల వయసులో 2013లో రాడిక్ స్టెపానిక్ తో జతకట్టిన పేస్, యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి, టెన్నిస్ చరిత్రలో అత్యధిక వయసులో డబుల్స్ టైటిల్ గెలుచుకున్న రికార్డునూ కైవసం చేసుకున్నాడు. ఇక తన కెరీర్ ఆరంభంలో కొన్ని డబుల్స్ మ్యాచ్ లు ఆడిన ఫెదరర్, ఆపై సింగల్స్ కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలో రాణించలేకపోతున్న ఈ టెన్నిస్ స్టార్, ఇక డబుల్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నాడట. తనకు తగ్గ జోడీగా పేస్ సరిపోతాడని ఫెదరర్ సైతం అనుకుంటుండడంతో ఈ విషయమై త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News