: భారత్ ట్యాగ్ లైన్ 'ఆకలిరాజ్యం'
సాంకేతికంగా ముందంజ, వర్ధమాన దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదిగే శక్తి ఉన్న దేశంగా పేరుప్రఖ్యాతులు, అంతరిక్షంలో సొంత శక్తితో సత్తాచాటగల సామర్థ్యం, ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలకు సీఈవోలు... ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ 'ఆకలి రాజ్యం' ట్యాగ్ లైన్ ను మాత్రం భారతదేశం పోగొట్టుకోలేకపోతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ లోనే ఎక్కువ మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 795 మిలియన్ల ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కోసం ఎదురు చూస్తుండగా, అందులో 194 మిలియన్ల మంది భారతీయులేనని ఆ నివేదిక పేర్కొంది. 1990-92 మధ్య కాలంలో భారత్ లో 210.01 మిలియన్ల మంది అన్నార్తులు ఉండగా, 2014-15 నాటికి 194.6 మిలియన్లకు పరిమితమైందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో చైనా 289 మిలియన్ల అన్నార్తుల సంఖ్యను 133.8 మిలియన్లకు పరిమితం చేసిందని నివేదిక వెల్లడించింది. అన్నార్తుల సంఖ్య తగ్గినప్పటికీ చైనా కంటే భారత్ చాలా వెనుకబడిపోయింది. దీంతో భారత్ 'ఆకలిరాజ్యం' అన్న ట్యాగ్ లైన్ తగిలించుకుని, ఈ విషయంలో చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.