: పార్టీ వీడుతున్న నేతలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్న పార్టీ నేతలపై ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన పాదయాత్రలో జరిగిన ఓ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. "నేను పాదయాత్రలో వుండగా, ఓ మహిళ వెనుకగా ఓ పొట్టేలు వెళుతుండగా చూశాను. అప్పుడు నేనామెను ఆపి... 'తల్లీ! నీ పొట్టేలు నీ వెనుకనే వస్తూ ఉంది, దానికేం పెడుతున్నావు?' అని అడిగాను. అందుకామె 'నేను గడ్డి పెడుతున్నానండీ, అది తినే నాతో వస్తుంద'ని టక్కున చెప్పింది. 'మరిప్పుడు నేను పిలిస్తే వస్తుందా?' అని ఆమెను అడిగాను, అందుకామె 'గడ్డి పెట్టండి' అంది. అప్పుడు నేను ఆ పొట్టేలుకు గడ్డి పెట్టినా, అది తినకుండా ఆమె వెనకాలే వెళ్లిపోయింది. అప్పుడు నేను మీడియాకు చెబుతూ, రాజకీయాల్లో లేని వాళ్లను ఎంపిక చేసి, అన్ని విధాలా తయారుచేసి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తే, అలాంటి వ్యక్తులు పార్టీని వదిలిపెట్టి పోతున్నారు. కాస్త గడ్డి పెడితే ఒక పొట్టేలు యజమాని పట్ల ఎంతో నమ్మకంగా వుంది. నేను పెట్టినా కూడా తినలేదు. అలాంటి విశ్వసనీయత ఈ రాజకీయ నాయకులకు లేకుండాపోవడం చాలా బాధ కలిగిస్తుంది" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు మాట్లాడిన నేతలను (పార్టీ మారిన వారు) అంతా చూశారని, ఇప్పుడు వారేం మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నారని బాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒకలా మాట్లాడిన వారికి, ఎన్నికలవ్వగానే తెలంగాణ అభివృద్ధి, వారి నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకొస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఆ రోజు మీకు ఈ విషయం జ్ఞాపకం లేదా? అని అడుగుతున్నానని మహానాడు వేదికగా బాబు నిలదీశారు.