: త్రిపురలో సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ
తమ రాష్ట్రంలో అమలవుతున్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాట్లను సమర్థవంతంగా నిరోధించేందుకు గత 18 ఏళ్లుగా త్రిపురలో ఈ చట్టం అమలవుతోంది. వివాదాస్పదంగా ఉన్న ఈ చట్టం రాష్ట్రంలో అవసరం లేదని ముఖ్యమంత్రి, హోం మంత్రిగా విధులు నిర్వహిస్తున్న మాణిక్ సర్కార్ తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించామని, రాష్ట్ర పోలీసులు, భద్రతా దళాలతో దీనిపై చర్చించామని, అంతా సాయుధబలగాల చట్టాన్ని ఉపసంహరించాలనే పేర్కొన్నారని ఆయన చెప్పారు. దీంతో, చట్టాన్ని ఎత్తివేయాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వెల్లడించారు.