: హైదరాబాదులో నిబంధనలను అతిక్రమించిన 'తానా' అధ్యక్షుడు... పోలీసులకు ఫిర్యాదు
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వేమన సతీష్ పై బంజారా హిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాదాపూర్ వరకు నీలి రంగు బుగ్గ ఉన్న కారులో ప్రయాణించారని సుంకర వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వేమన సతీష్ కు నీలి రంగు బుగ్గ వాడే పోస్టు కానీ, ప్రొటోకాల్ కానీ లేదని... కేవలం తన స్టేటస్ ను ప్రచారం చేసుకోవడానికే ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సతీష్ అతిక్రమించారని... అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్ పోర్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే దీనికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయని చెప్పారు. అంతేకాకుండా, వేమన సతీష్ కారు ఎక్కుతుండగా తీసిన ఫొటోలను కూడా పోలీసులకు అందజేశారు.