: టీడీపీ ప్రమాద బీమా పథకాన్ని టీఆర్ఎస్ కాపీ కొట్టింది: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీకి 54 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తలతో పాటు వారి పిల్లలను కూడా టీడీపీ తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గండిపేటలో జరుగుతున్న తొలిరోజు మహానాడులో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు టీడీపీ అందిస్తున్న సహాయాన్ని వివరించారు. ఇప్పటివరకు 450 మంది కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. కార్యకర్తల పిల్లల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న 255 మంది కార్యకర్తల పిల్లలను చదివిస్తున్నామని వివరించారు. కార్యకర్తల పిల్లల కోసం వచ్చే ఏడాది మోడల్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తల పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ఇక గతేడాది పార్టీ ప్రమాద బీమా తీసుకొచ్చాక 700 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారని, ఇది చాలా బాధాకరమైన విషయమని లోకేష్ అన్నారు. టీడీపీ ప్రమాద బీమాను టీఆర్ఎస్ కాపీ కొట్టిందన్న ఆయన, తమ ప్రమాద బీమాను చూసి కేంద్రమే కొత్త పథకాలు తెచ్చిందని వెల్లడించారు. ఇక పార్టీ 54 లక్షల సభ్యత్వాల నమోదు చేయడానికి పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సహకారం, ప్రోద్బలమేనని లోకేష్ అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కొందరిని తాను ఇబ్బంది పెట్టానని, అందుకు తనను క్షమించాలని కోరారు.