: మహానాడులో రామారావును పలుమార్లు తలచుకున్న చంద్రబాబు!
34వ మహానాడు వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం, దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి మహానాడును ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పలుమార్లు ఎన్టీఆర్ ను తలచుకున్నారు. నేతలకు, కార్యకర్తలకు స్వాగతం పలికిన అనంతరం ప్రసంగిస్తూ, "ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ మీ ఉత్సాహం పెరుగుతూ ఉంది. కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా మహానాడంటే ఒక పవిత్రమైన రోజుగా మీరు భావించి తప్పనిసరిగా విధిగా హాజరవుతున్నారు. ప్రజలకు అనేక పండగలుంటే, మన రాష్ట్రానికి, మన నాయకులకు, కార్యకర్తలకు ఇది చాలా ముఖ్యమైన పండగ. ఒక మహానాడు. ఈ మహానాడు విశిష్టత మనం ఆలోచిస్తే, మన నాయకుడి జన్మదిన సందర్భంగా మనం మహానాడు జరుపుకుంటున్నాం" అని అన్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన ఆయన "ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఎంతో మంది నాయకులు పుట్టారు, వ్యక్తులు పుట్టారు. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేవాళ్లు కొందరే ఉంటారు. అందులో ప్రముఖమైన వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం కోసం మన నాయకుడు పార్టీ పెట్టలేదు. లేకపోతే, ఏదో వ్యాపకం కోసరం పార్టీ పెట్టలేదు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసరం, తెలుగు జాతిని అన్ని రంగాలలో అభివృద్ధి చెయ్యడం కోసం ఆ రోజు పార్టీ పెట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోపక్క మనం కొన్ని సంప్రదాయాలు పాటిస్తున్నాం. ఇది 34వ మహానాడు" అని గుర్తు చేశారు. ఆ నేత అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు ఒకే విధమైన స్పందన వచ్చిందని అన్నారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది.