: పశ్చిమ బెంగాల్ లో మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా హిజ్రా... ప్రపంచంలోనే మొదటిసారి!
పశ్చిమ బెంగాల్ లోని క్రిష్ నగర్ మహిళా కళాశాల ఓ అత్యంత అరుదైన గుర్తింపును పొందనుంది. ఈ కళాశాలకు ప్రిన్సిపాల్ గా జూన్ 9న మనబీ బందోపాధ్యాయ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆమె ఓ హిజ్రా కావడమే ఇక్కడ స్పెషల్. ఇండియాలో, బహుశా ప్రపంచంలోనే ఓ కళాశాల బాధ్యతలు స్వీకరించనున్న హిజ్రాగా ఆమె (అతడు) చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం వివేకానంద సతోబార్షినికి మహావిద్యాలయలో ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. "ఈ నిర్ణయాన్ని కాలేజీ సర్వీస్ కమిషన్ తీసుకుంది. వారి నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోలేను. వారి నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది" అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పార్థా చటర్జీ వ్యాఖ్యానించారు. "ఆమె కాలేజీని సమర్థవంతంగా నడపగలరని భావిస్తున్నాం. అందువల్లే ఈ నియామకాన్ని చేపట్టాము" అని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి, కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్మన్ ఉజల్ బిస్వాస్ తెలిపారు. మనబి నియామకాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. "మనబి చాలా మంచి మనిషి. చాలా విద్యాధికురాలు, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టడంలో దిట్ట. ఆమె నియామకం ట్రాన్స్ జండర్ కమ్యూనిటీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది" అని కల్యాణీ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ రతన్ లాల్ హాంగ్లూ అన్నారు. కాగా, ఆమె మంగళవారం నాడు రేబాన్ గ్లాసులు ధరించి, ఓ విచిత్రమైన హెయిర్ స్టయిల్ తో, పెద్ద బొట్టు, లోలాకులు ధరించి, ఆమె దత్త పుత్రడు దేబాశిష్ మనబి పుత్రో, మరో హిజ్రా స్నేహితురాలు జ్యోతి సమంతాలు వెంట రాగా, కళాశాలను సందర్శించారు.