: మహానాడులో నారా లోకేష్ కు బ్రహ్మరథం... కరచాలనం కోసం పోటీపడ్డ నేతలు
హైదరాబాదులోని గండిపేట వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన నేతలంతా సభాస్థలికి తరలి వచ్చారు. యువనేత నారా లోకేష్, నందమూరి హరికృష్ణలు కూడా ప్రాంగణానికి చేరుకున్నారు. నారా లోకేష్ రాకతో సభాస్థలిలో ఉత్సాహం నెలకొంది. టీడీపీ సీనియర్ నేతలు సైతం లోకేష్ దగ్గరకు వచ్చి పలకరించారు. లోకేష్ తో కరచాలనం చేయడానికి నేతలు పోటీపడ్డారు. పార్టీ కార్యకర్తలు లోకేష్ కు నీరాజనం పలుకుతున్నారు. సభా ప్రాంగణంలోని ఫ్లెక్సీలలో లోకేష్ ఫొటోలను ఉంచారు. మరోవైపు, భీతిగొలుపుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది కార్యకర్తలు టీడీపీ పండుగకు తరలివస్తున్నారు. 70 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఉత్సాహంగా ప్రాంగణానికి వస్తుండటం గమనార్హం. తొలిరోజు 50 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.