: ముంబై విమానాశ్రయంపై యూఎఫ్ఓలు... అందరూ చూశారు!
ముంబై విమానాశ్రయం సమీపంలో ఐదు 'యూఎఫ్ఓ' (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్)లు కనిపించాయి. వీటిని వందల సంఖ్యలో ప్రజలు చూశారు. తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇవేంటన్న విషయంపై పోలీసులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇవి పారాచూట్ల ఆకారంలో ఉన్నాయి. ఇవి చైనీస్ లాండర్లు అయివుండవచ్చని భావిస్తున్నట్టు మహారాష్ట్ర హోం శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇవి చివరగా సహర్ రోడ్డులోని ఐటీసీ మరాథా హోటల్ వద్ద కనిపించి ఆపై మాయమైనాయని అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షీ వివరించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇవి ఏ విధమైన మోటార్ల సాయంతో నడవలేదని గుర్తించామని, మరో రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. ముంబై విమానాశ్రయంలో టేకాఫ్ అయిన జెట్ ఎయిర్ వేస్ విమానం పైలెట్ వీటిని చూసి ఆ వెంటనే విమానాన్ని కిందకు దించి ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు మాయమయ్యాయో మిస్టరీగా ఉందని బక్షీ తెలిపారు.