: అమరావతిలో 'బ్రహ్మస్థానం'
ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ బృందం నేడు సీఎం చంద్రబాబుకు అందించడం తెలిసిందే. ఆ బృహత్తర ప్రణాళికలో వాస్తుకు పెద్దపీట వేసినట్టు అర్థమవుతోంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ లో వాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. విజయవాడ కేంద్రంగా పేర్కొన్న రాజధానిలో ఈశాన్యంగా, కృష్ణానదికి అభిముఖంగా 'బ్రహ్మస్థానం' పేరిట కొంత ప్రదేశాన్ని ఖాళీగా వదిలేయాలని ప్లాన్ లో సూచించారు. ఆ ప్రదేశం త్రిభుజాకారంలో ఉండాలని పేర్కొన్నారు. వాస్తు సిద్ధాంతాలను అనుసరించి, 'బ్రహ్మస్థానం' కారణంగా అమితవేగంతో అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిక. సుర్బానా ఇంటర్నేషనల్ కన్సెల్టెన్సీ సంస్థ ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించింది. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు వీలుగా ఈ ప్లాన్ డిజైన్ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ సంఖ్యలో ఎక్స్ ప్రెస్ వేలు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తారు. ప్రపంచ మహానగరాల తరహాలో పాదచారులకు, సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు, నగరంలో జలమార్గాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా కాలుష్యం తగ్గుతుందన్నది ప్లాన్ డిజైనర్ల యోచన. ముఖ్యమైన పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యమిచ్చారు. చారిత్రక ప్రదేశాలను కలుపుతూ మెట్రో రైలు, జలమార్గాలు, విశాలమైన రోడ్లు నిర్మిస్తారు.