: మాస్టర్ డెవెలపర్ గా సింగపూర్ ప్రభుత్వం ఉండాలని భావిస్తున్నాం: ఏపీ సీఎం
మాస్టర్ డెవెలపర్ గా సింగపూర్ ప్రభుత్వం ఉండాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అయితే కన్సార్టియం ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం జరగాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో సింగపూర్ ప్రతినిధులు రాజధాని మాస్టర్ ప్లాన్ అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కన్సార్టియంలో సింగపూర్, జపాన్, చైనా, జర్మనీ, ఇతర దేశాలు, లేదా పెద్దపెద్ద కంపెనీలు, ఇలా ఏవైనా ఉండవచ్చని అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే, ప్రపంచం గర్వించదగ్గ రాజధాని నిర్మాణం జరపాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం పాత్ర ఎంతో ఉందని, గతంలో రాజధాని నిర్మాణం నిమిత్తం అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ నుంచి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. అలాగే రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం తన వంతు సహకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా తమకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. చాలా పెద్ద బాధ్యత తమపై ఉందని చెప్పిన ఆయన, మీడియా ప్రతినిధులు భవిష్యత్ తరాల అవసరాలను గుర్తించి, ఆలోచించి వార్తలు రాయాలని ఆయన చెప్పారు.