: మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏపీ రాజధాని వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రతిని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. హైదరాబాదులో ఈ మేరకు జరిగిన సమావేశంలో సింగపూర్ కు చెందిన సుర్బానా సంస్థ సీఈవో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణపు మాస్టర్ ప్లాన్ పై వివరించారు. సీఆర్డీఏ పరిధిని ఏడు కారిడార్లుగా విభజించారు. 270 కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. విజయవాడ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్టణం దిశగా ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎక్స్ ప్రెస్ వే 60 కిలోమీర్లు విస్తరించి ఉంటుందని ఆయన వెల్లడించారు. రాజధాని చుట్టుప్రక్కల ప్రాంతాన్ని కలుపుతూ రింగ్ రోడ్డు వస్తుందని ఆయన తెలిపారు. నాలుగు లేన్ల రోడ్లు నగరం మొత్తం విస్తరించి ఉంటాయని ఆయన అన్నారు. పూర్తి వాస్తు ప్రకారం ప్లాన్ ఉండడం విశేషం. కృష్ణాతీరం రాజధానికి మరింత అనుకూలంగా మారనుందని ఆయన చెప్పారు. కోటీ పది లక్షల మందికి తగ్గట్టు రాజధాని నిర్మాణం జరగనుందని ఆయన వివరించారు.