: లంచాల లెక్క... పట్టణాల్లో ఉంటే రూ. 4,400, గ్రామాల్లో ఉంటే రూ. 2,900 సమర్పించుకోవాల్సిందే!
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక్కో కుటుంబం ఏడాదికి సరాసరిన రూ. 4,400 లంచం రూపంలో సమర్పించుకుంటోంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబం రూ. 2,900 లంచమిస్తోంది. ఈ ఆసక్తికర విషయాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్ సీఏఈఆర్) తన తాజా సర్వేలో వెల్లడించింది. లంచాలు అధికంగా ఇచ్చే నగరాల్లో పాట్నా, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పుణె నగరాలున్నాయని తెలిపింది. పరిపాలనాధికారులు, పోలీసులకు అధికమొత్తం లంచాలు అందుతున్నాయని పేర్కొంది. నగరాల్లోని ఉద్యోగులు తమ బదిలీల కోసం సగటున రూ. 18 వేలు లంచంగా ఇస్తున్నారని, సంవత్సరానికి రూ. 600 పోలీసులకు 'ఆమ్యామ్యా'లుగా ఇవ్వాల్సి వస్తోందని వివరించింది. లంచాల రూపంలో చేతులు మారుతున్న డబ్బే నల్లధనం పెరిగేందుకు ముఖ్య కారణమని ఎన్ సీఏఈఆర్ అభిప్రాయపడింది. పేదలకు నిర్దేశించిన వివిధ పథకాల్లో లబ్ధిదారులు కావాలంటే గ్రామాల్లో అధికారుల చేతులు తడపాల్సిందేనని తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇందిరా ఆవాస్ యోజన తదితర పథకాల నుంచి విద్యార్థుల స్కాలర్ షిప్పుల వరకూ లంచం లేనిదే పని కావడం లేదని తేల్చింది.