: విదేశీగడ్డపై చేసిన వ్యాఖ్యలపై మోదీపై కేసు నమోదు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దక్షిణకొరియాలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. విదేశీ పర్యటన సందర్భంగా, సియోల్ లో ఆయన భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆర్టీఐ కార్యకర్త సందీప్ శుక్లా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను తాను టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు. ఆ మాటలు తనను ఎంతో బాధించాయంటూ, మోదీ వ్యాఖ్యల తాలూకు సీడీని కూడా న్యాయస్థానానికి అందించారు. దీనిపై న్యాయస్థానం జూన్ 10న విచారణ జరపనుంది. కాగా, సియోల్ లో ప్రధాని మాట్లాడుతూ... ఇంతకుముందు ఎన్నారైలు తాము భారతీయులమని చెప్పుకునేందుకు సిగ్గుపడేవారని, తాము అధికారం చేపట్టాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని వ్యాఖ్యానించారు.