: తెలంగాణ సర్కారు సహకరించేలా కనిపించడం లేదు: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన అంశాలపై తెలంగాణ సర్కారు సహకరించేలా కనిపించడం లేదని అన్నారు. ఇంకా ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. తమ నవ నిర్మాణ దీక్ష తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని, వారికి నష్టం వాటిల్లబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన అంతకుముందు ఏపీ క్యాబినెట్ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం పట్ల ప్రజల్లో కసి ఇంకా చల్లారలేదని అన్నారు. రాష్ట్రం ముక్కలై సంవత్సరం గడుస్తున్నా, ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమైన సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు.