: అభినవ భరతుడికి ఆర్థిక శాఖ!


తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష కారణంగా సీఎం పీఠాన్ని జయ కోల్పోగా, నమ్మినబంటులాంటి పన్నీర్ సెల్వమ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పురచ్చితలైవిని కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో ఆమె సీఎం పీఠం అధిష్ఠించేందుకు మార్గం సుగమమైంది. దీంతో, పన్నీర్ సెల్వమ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, అమ్మ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యాక, పన్నీర్ సెల్వమ్ సీఎం కుర్చీలో కూర్చోలేదని, జయలలిత ఫొటో పెట్టుకుని పరిపాలన సాగించారన్నది తెలిసిన విషయమే. దీంతో, మీడియాలో ఆయనను అభినవ భరతుడు అని శ్లాఘించారు. రామాయణంలో, రాముడు వనవాసానికి వెళ్లగా, తమ్ముడు భరతుడు అన్న పాదరక్షలను సింహాసనంపై ఉంచి పాలన నిర్వహించడం తెలిసిందే. ఇప్పుడు అమ్మ పట్ల విధేయత ప్రకటించి, ఆమె తిరిగిరాగానే సీఎం పీఠాన్ని భద్రంగా అప్పగించిన పన్నీర్ సెల్వమ్ కు ఆర్ధిక శాఖ కేటాయించనున్నట్టు తెలిసింది. గతంలోనూ, ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఇక, రేపటి ప్రమాణస్వీకార కార్యక్రమంలో జయతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News