: తెలంగాణ సచివాలయం సమీపంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాదులోని తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను నల్గొండ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు. గతంలో కాంట్రాక్టు విద్యుత్ కార్మికుడిగా పనిచేసిన తనను విధుల్లోంచి తీసివేయడంతో మనస్తాపానికి గురై ఇలా చేసినట్టు చెబుతున్నారు. ఇద్దరు యువకులు కలసి సచివాలయానికి వచ్చారని, వారిలో ఒకరైన చంద్రశేఖర్ పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. వెంటనే అతడిని ఎవరూ గుర్తించకపోవడంతో, పక్కన ఉన్న మరో యువకుడు అక్కడున్న వారికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే అక్కడికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు.