: కట్నం బదులు మొక్కలు అడిగారు!
దేశంలో అధికారికం కాకపోయినా కట్నం ఇవ్వడం ప్రధాన లాంఛనం. నగదు, నగలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, తోటలు, బైకులు, కార్లు... ఇలా ఎవరి తాహతు కొద్దీ వారు వరుడికి సమర్పించుకుంటుంటారు. కానీ, యూపీలో ఓ కుటుంబం కట్నం ఏమీ వద్దని, మామిడి మొక్కలు ఇవ్వండని పెళ్లి కూతురు కుటుంబాన్ని అడిగింది. వివరాల్లోకెళితే... వారణాసికి సమీపంలో కనేరీ అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన ఓంకార్ పటేల్ కు బేనిపూర్ కు చెందిన సరోజా పటేల్ తో వివాహం జరిగింది. అయితే, ఓంకార్ తల్లిదండ్రులకు కట్నం తీసుకోవడం ఇష్టంలేదు. అందుకే వారు ఐదు మామిడి మొక్కలు ఇవ్వాలని అడిగారు. వారు ఐదడిగితే వధువు తల్లిదండ్రులు ఏడు మామిడి మొక్కలు ఇచ్చారు. అమ్మాయిని కాపురానికి పంపుతూ ఆ మొక్కలు కూడా పంపించారు. ఇప్పుడా మొక్కలను చూసేందుకు గ్రామస్థులు బారులు తీరారట. వధువే స్వయంగా ఆ మామిడి మొక్కలను అత్తవారింట నాటింది.