: తేలని ఆస్తుల పంపకం... ఆర్టీసీ విభజన మరోసారి వాయిదా


ఆస్తుల పంపకం విషయంలో అన్యాయం జరగవచ్చన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఆర్టీసీ విభజన సమావేశాన్ని మరోసారి వాయిదా వేయించుకుంది. వాస్తవానికి ఈనెల 25న పాలకమండలి సమావేశం జరిగి, అధికారికంగా విభజన జరగాల్సి వుండగా, తెలంగాణకు తగిన ప్రాతినిథ్యం లేని కారణంగా వాయిదా వేయాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందించడంతో సమావేశం వాయిదా పడింది. దీంతో 28 నుంచి విడివిడిగా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న అధికారుల ఆలోచన ఆగిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీ పాలక వర్గంలో 14 మంది సభ్యులున్నారు. ఆర్టీసీ నుంచి ఆరుగురు, కార్మిక సంఘాల నుంచి ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, మిగిలిన నలుగురు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. వీరిలో ఆర్టీసీ ఛైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎంప్లాయిస్ యూనియన్ నుంచి బోర్డు సభ్యులుగా ఉన్న పద్మాకర్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 12కు తగ్గగా, తెలంగాణకు చెందిన వారు ఇద్దరే ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు, అప్పుల విభజన, పంపకాలు తదితర కీలకాంశాలపై చర్చించి ఈ కమిటీ విభజనను ఆమోదించాల్సి వుంది. ఆర్టీసీకి హైదరాబాదులో ఉన్న 14 ఉమ్మడి ఆస్తుల్లో 58 శాతం వాటా తమకే చెందాలని ఏపీ కార్మిక సంఘాలు గట్టి పట్టుతో ఉన్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఎస్ కార్మిక సంఘాలు తెలంగాణలోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని వాదిస్తున్నారు. దీంతో, ఏకాభిప్రాయం కుదరక విభజన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.

  • Loading...

More Telugu News