: నేటి నుంచి ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు బంద్
కూకట్ పల్లి నాలా వ్యర్థాల మళ్లింపునకు చేపడుతోన్న పైపులైన్ పనుల కోసం ట్యాంక్ బండ్ పై 10 రోజుల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. జంటనగరాల మధ్య వారధిగా ఉన్న ట్యాంక్ బండ్ పై నిత్యమూ లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల నుంచి కోఠి, బేగంబజార్, సచివాలయం, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలకు రావాలనుకునే వారు ట్యాంక్ బండ్ పై ప్రయాణించాల్సిందే. ఈ రహదారిని నిలిపివేస్తే తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు అంటున్నారు. కాగా, వాటర్‌బోర్డు అధికారులు నేటి నుంచి కాలువ పనులను ముమ్మరం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ట్యాంక్ బండ్ పై రవాణాను బంద్ చేయడంతో లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, బైబిల్ హౌస్, నెక్లెస్ రోడ్డు, రాణీగంజ్ తదితర ప్రాంతాలపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగనుంది. మొత్తం 3.5 కి.మీ. మేరకు పైప్ లైన్ నిర్మించాల్సి వుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేసేందుకు పది రోజులు మాత్రమే అనుమతించారు. ఈ పది రోజుల్లో పనులు పూర్తవుతాయో? లేదో? అధికారులే చెప్పలేకపోతున్నారు.