: మైదానంలో ప్రియులు... గ్యాలరీల్లో ప్రియురాళ్లు...అభిమానులకు డబుల్ ఎంటర్ టైన్మెంట్!
ఐపీఎల్ సీజన్-8లో ఆటగాళ్లతో పాటు, వారి ప్రియురాళ్లు కూడా అభిమానులను అలరించారు. ఏదైనా సిరీస్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు తమ ప్రియురాళ్లు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ఆటపై మనసు లగ్నం చేయాలనే నిబంధనలు ఉండేవి. వీటి కారణంగా ఆటగాళ్లు మైదానంలో ఆడేటప్పుడు వారి కుటుంబ సభ్యులు కానీ, ప్రియురాళ్లు కానీ కనబడేవారు కాదు. బీసీసీఐలో మార్పో లేక నిబంధనల్లో మార్పో తెలియదు కానీ, ఐపీఎల్ సీజన్ ఆసాంతం క్రీడాకారులతో వారి ప్రియురాళ్లు కనబడుతూనే ఉన్నారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ప్రియురాలు లేకపోతే ఉండలేకపోయినట్టు ప్రవర్తించాడు. ఆట మధ్యలో ప్రియురాలి దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టాడు. ఈ ఘటన విమర్శలపాలైనా, వారి అభిమానులను మాత్రం ఆ సన్నివేశం అలరించింది. కోహ్లీ ఆడుతుంటే అనుష్క శర్మ ఎక్కడుందోనని కెమేరాలు కూడా గాలిస్తూ, ఆమె హావభావాలను బంధిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కాబోయే భార్య రితిక గ్యాలరీలో సందడి చేస్తోంది. రోహిత్ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కూ హాజరవుతూ, టెన్షన్ గా గడుపుతోంది. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రియురాలు, సినీ నటి గీతా బాస్రా కూడా ఓ మ్యాచ్ లో గ్యాలరీలో కనిపించి అభిమానులను అలరించింది. రోహిత్ శర్మ లవర్ రితిక పక్కన కూర్చుని గీతాబాస్రా మ్యాచ్ తిలకించడం అభిమానులను ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ భార్య సాక్షి ప్రతి మ్యాచ్ లో సందడి చేసేది. కుమార్తె పుట్టడంతో ఆమె అప్పుడప్పుడు మ్యాచ్ లకు హాజరవుతూ వచ్చింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ప్రతి మ్యాచ్ లోనూ కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. పూణేలో జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ భార్య, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్, అనుష్క శర్మతో కలిసి మ్యాచ్ వీక్షించి అభిమానులను అలరించారు. మొత్తానికి ఈ సిజన్ లో ఆటగాళు మైదానంలో ఆటతో ఆకట్టుకుంటే, గ్యాలరీలో వారి ప్రియురాళ్లు, భార్యలు తమ హావభావాలతో అభిమానులను అలరించారు.