: ఏపీ ప్రత్యేక హోదాపై వాదించుకున్న టీకాంగ్ సీనియర్ నేతలు
ఏపీకి ప్రత్యేక హోదా వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వరాదంటూ కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాయడాన్ని టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరాదంటూ గుత్తా లేఖ రాయడం సరైన పని కాదని వ్యాఖ్యానించారు. గుత్తా చర్యలతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన విమర్శించారు. దీనపై స్పందించిన గుత్తా... తాను వ్యక్తిగతంగానే ప్రత్యేక హోదాపై లేఖ రాశానని చెప్పారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలి పోతాయనే ఉద్దేశంతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లేఖ ఎలా రాస్తారని రంగారెడ్డి నిలదీశారు. దీనికి సమాధానంగా, తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినప్పుడు... అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు ఎలా వ్యతిరేకించారని ప్రశ్నించారు. ఒక టీవీ చానల్ డిస్కషన్ లో ఈ వాదన జరిగింది.