: యువతుల అక్రమ రవాణా గుట్టు రట్టు!
యువతుల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. పూరి - తిరుపతి ఎక్స్ ప్రెస్ లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళుతున్న 15 మంది యువతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో గురువారం తెల్లవారుఝామున చోటు చేసుకున్న ఈ ఘటనలో వీరిని తరలిస్తున్న వారు తప్పించుకున్నారు. యువతుల అక్రమ రవాణా గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సోదాలు జరిపి వీరిని గుర్తించారు. ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతానికి చెందిన 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 15 మంది యువతుల్ని అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమ భవనానికి తరలించారు. వీరిని పోలీసులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సమాచారం. భీమవరంలో ఓ చేపల చెరువు కాంట్రాక్టర్ వద్ద పనికి వెళుతున్నామని ఓసారి, తమది రాజమండ్రి అని, పూరీలో దేవుడి దర్శనానికి వెళ్లి వస్తున్నామని ఓసారీ చెప్పారు. వీరి గురించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారు. వీరి సెల్ ఫోన్ల కాల్ డేటాను విశ్లేషించే పనిలో పోలీసులు ఉన్నారు.