: పాకిస్థాన్ బాలికను ఆదుకునేందుకు కదిలిన ముంబై
పాకిస్థాన్ లోని సబా తారిక్ అహ్మద్ (15) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం ముంబై నగరానికి తన తల్లిదండ్రులతో వచ్చింది. ఆమెకున్న వ్యాధి పేరు 'విల్సన్ డిసీజ్'. ఇదో అత్యంత అరుదైన జన్యు సంబంధ వ్యాధి. శరీరంలో కాపర్ శాతాన్ని తినేస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు, మెదడు తదితర ముఖ్య అవయవాల్లో ఆర్గానుల పునరుత్పత్తి తగ్గుతుంది. సమయానికి చికిత్స జరగకపోతే, కృశించి, నశించి మరణించాల్సిందే. చికిత్స కోసం కూతురిని దక్షిణ ముంబైలోని జస్లోక్ ఆసుపత్రికి తీసుకు వచ్చిన సబా తల్లి నజియా రూ. 3 లక్షలకు పైగా డబ్బుతో ముంబైలో కాలుపెట్టింది. వచ్చిన కొద్ది రోజులకే అదంతా ఖర్చయిపోయింది. మళ్లీ కరాచీ వెళ్లాలని ఆమె భావిస్తున్న సమయంలో, నజియా సోదరి పరిస్థితిని వివరిస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టింది. దీంతో స్పందించిన ముంబై వాసులు సబాను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఒక్క రోజులో రూ. 1.5 లక్షలు పోగయింది. కేవలం నెటిజన్లే కాదు, ఆసుపత్రి డాక్టర్లు సైతం సాయం చేశారు. దీంతో సబాకు చికిత్స నిరాటంకంగా సాగుతోంది. "నేను పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు ముంబైలో ఎవరికీ చెప్పవద్దని నాకు మా ప్రాంతం వారు చెప్పారు. కానీ, నేను ఇక్కడ అబద్ధం చెప్పలేదు. ఇండియాలో వైద్యులు ఎంతో మంచివారని నాకు నమ్మకం ఉంది. హిందుస్థాన్ లో మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతను ఎన్నటికీ మరువను" అని నజియా చెబుతోంది. ట్రీట్ మెంటుకు సబా స్పందిస్తున్న తీరును చూసిన తరువాత డాక్టర్లు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డబ్బు లేని కారణంగా చికిత్సను ఆపరాదని నిర్ణయించుకున్నామని జస్లోక్ ఆసుపత్రి సీఈఓ తరంగం జ్ఞాన్ చందానీ వివరించారు.